
సకల పాప హరం.. హనుమద్ దర్శనం
గుంతకల్లు రూరల్/బొమ్మనహాళ్/రాయదుర్గం: అంజనీ సుతుడిని శ్రావణ మాసంలో దర్శించుకుంటే అన్ని కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. జిల్లాలో ప్రముఖంగా చెప్పుకునే నేమకల్లు, మురడి, కసాపురం ఆలయాల్లో శ్రావణ మాసంలో హనుమద్ దర్శనానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మూడు ఆలయాలను ఒకే రోజులో దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.
భక్తుల పాలిట కొంగుబంగారమై..
జిల్లాలో భక్తుల పాలిట కొంగుబంగారంగా, భక్తజన వరదాయకుడిగా నేమకల్లు, మురడి, కసాపురంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాలు విరాజిల్లుతున్నాయి. క్రీ.శ. 15వ శతాబ్దంలో వ్యాసరాయమహర్షి ఒకే రోజున ఈ ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించినట్లు చరిత్ర తెలుపుతోంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శని వారాల్లో ఈ మూడు ఆలయాలను దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ నెల 26న వచ్చే తొలి శ్రావణ శనివారం నుంచి నేమకల్లు, మురడి, కసాపురం ఆలయాల్లో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రథోత్సవాలతో ఆలయాల్లో సందడి నెలకొననుంది. ఈ నేపథ్యంలో మూడు ఆలయాలను సర్వాంగ సుందరంగా అలకరించారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, వసతి గృహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 26, ఆగస్టు 2, 9, 16, 23వ తేదీల్లో వచ్చే శనివారాలు, ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19వ తేదీల్లో వచ్చే మంగళవారాల్లో మూడు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తలు పోటెత్తుతుంటారు.
ఆలయాల విశేషం
జాతక దోషంతో సింహాసనం కోల్పోయిన శ్రీకృష్ణదేవరాయలు.. ఆ దోషం తొలగిపోయేందుకు 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించాలని వ్యాసరాయలు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా హంపీలో యంత్రోధారక ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం పెనుకొండ వద్ద 103 ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. చివరకు నేమకల్లు, మురడి, కసాపురంలో ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో వ్యాసరాయ మహర్షి దివ్య దృష్టితో విష్టుమూర్తి వామన రూపంలో వచ్చి మూడు అడుగుల స్ధలాన్ని తీసుకున్న ప్రాంతాలు ఇవేనని గుర్తించి, మూలవిరాట్‌లకు ప్రాణప్రతిష్ట గావించారు. శ్రావణ మాసంలో ఈ మూడు ఆలయాలను ఒకే రోజు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకోవడంతో జాతక దోషం తొలిగిపోయింది. అప్పటి నుంచి ఈ మూడు ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తూ వస్తున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రావణమాసంలో ఒకే రోజు మూడు ఆలయాలను దర్శించుకునేలా ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్డీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి శని, మంగళవారాల్లో అనంతపురం జిల్లాలోని 7 ఆర్డీసీ డిపోల నుంచి దాదాపు 100 బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. కనీసం 50 మంది భక్తులు ఏకతాటిపైకి వచ్చి మూడు ఆలయాల సందర్శనకు ముందుకు వస్తే వారు కోరుకున్న ప్రాంతానికి ప్రత్యేకంగా బస్సును పంపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్రతి శనివారం ప్రాకారోత్సవం
ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన మొదటి శనివారం కసాపురంలో స్వామివారిని వజ్రకవచంతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సాయంత్రం సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 2వ తేదీ రెండో శనివారం ఉత్సవమూర్తులను హనుమద్ వాహనంపై, ఆగస్టు 9 మూడో శనివారం గజ వాహనంపై, ఆగస్టు 16 నాల్గవ శనివారం గరుడ వాహనంపై, ఆగస్టు 23 ఐదో శనివారం ఒంటె వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా ఉత్సవమూర్తులను వెండిరథంలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు.
శ్రావణ మాసంలో మూడు
ఆలయాలను దర్శించుకుంటే పుణ్యఫలం
ప్రత్యేక ఏర్పాట్లలో దేవదాయశాఖ
అధికారులు
జిల్లా వ్యాప్తంగా 100 బస్సులు నడిపేలా ఆర్డీసీ కార్యాచరణ
ఈ నెల 26న తొలి శ్రావణ శనివారం
ఆధ్యాత్మిక, ఆనందాల సమ్మేళనాల శ్రావణ మాసం
శనివారంతో ప్రారంభం కానుంది. నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమాస్య తదితర ముఖ్యమైన వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి. మహిమాన్వితమైన శ్రావణ మాసంలో హనుమద్ దర్శనం సకల పాపాలను హరిస్తుందని నమ్మకం. ప్రత్యేకించి వ్యాసరాయలు ప్రతిష్టించిన మూడు హనుమద్ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే ఎంతటి కష్టమైనా ఇట్టే దూరమవుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ శ్రావణ మాసంలో జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని హనుమద్ క్షేత్రాల సందర్శనకు భక్తులు పోటెత్తనున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు
ఈ ఏడాది శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుందని ముందస్తుగా అంచనాకు వచ్చాం. ఇందుకు తగినట్లుగానే భద్రత, సౌకర్యాలు కల్పించాం. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాం. శని, మంగళవారాల్లో అన్నదానం లాంటి కార్యక్రమాలు ఉంటాయి.
– నరసింహారెడ్డి, ఈఓ, రాయదుర్గం
ఏర్పాట్లు పూర్తి..
ఆలయంలో నెల రోజుల పాటు వైభవంగా జరిగే శ్రావణమాస ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తుల కోసం గుంతకల్లు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.
– కె.వాణి, ఆలయ ఈఓ, కసాపురం

సకల పాప హరం.. హనుమద్ దర్శనం

సకల పాప హరం.. హనుమద్ దర్శనం

సకల పాప హరం.. హనుమద్ దర్శనం

సకల పాప హరం.. హనుమద్ దర్శనం