
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
● ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు డిమాండ్
అనంతపురం అర్బన్: జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు డిమాండ్ చేశారు. అధికారి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను, వ్యవహరించిన తీరును ఖండించారు. డీపీఓను ఆయన చాంబర్‌లో మంగళవారం దివాకర్‌రావుతో పాటు జేఏసీ ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, వైస్ ప్రెసిడెంట్ కొండయ్య, నాయకులు మూర్తి, ఓబులేసుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు వారిపైనే దాడులకు సిద్ధపడడం బాధాకరమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రం అనాలా? ఎక్కడైనా ఏదైనా మాట్లాడవచ్చు అని భావితరాలకు ఇచ్చే సంకేతంగా భావించాలో అర్థం కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల వద్దనే ఉద్యోగులకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. విధినిర్వహణలో చేసింది తప్పయితే... విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖపరమైన చర్యలకు సిఫారసు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఎస్‌ఐల బదిలీ
అనంతపురం: వీఆర్‌లో ఉన్న ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ పి.జగదీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఆర్‌బీకి జి.రాజేంద్రప్రసాద్, సీసీఎస్‌కు ఎ.దాదాపీర్, ఎస్.జయప్ప, ఎన్.రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం రూరల్ యూపీఎస్‌కు సి.బాబు, బుక్కరాయసముద్రం యూపీఎస్‌కు వి.రాంప్రసాద్ బదిలీ అయ్యారు.
‘సూపర్’కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
● మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగుపరిచేలా అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాంటూ ఆస్పత్రి ఎదుట ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రుల అభివృద్ధిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించడం సబబు కాదన్నారు. ఆరోగ్యాన్ని హక్కుగా ప్రకటించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 8 స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృతం చేసేలా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్‌ను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. న్యూరో, కార్డియో, తదితర కేసులను నేరుగా ఇక్కడే అడ్మిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజారోగ్యవేదిక జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, ఏజీ రాజమోహన్, సీఐటీయూ, రైతు సంఘం, ఏపీఎంఎస్‌ఆర్‌యూ, పెన్షనర్స్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
22ఏటీపీసీ13ఏ
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న ప్రజారోగ్యవేదిక నాయకులు