
మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యం
అనంతపురం: మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా డ్రోన్లతో నిఘా పెంచనున్నట్లు ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. జిల్లాలోని శక్తి టీమ్స్‌కు డ్రోన్ల వినియోగంపై మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. అంతుకు ముందుమహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ వినియోగించే 28 ద్విచక్రవాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, రద్దీ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ఆర్టీసీ బస్టాండు, ముఖ్య కూడళ్లలో నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్‌బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు ధరణి కిశోర్, క్రాంతి కుమార్, వెంకటేశులు, ఆర్‌ఐలు మధు, పవన్‌కుమార్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీ
గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామ శివారున ఉన్న రైతు సేవాకేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రైతుసేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ తలుపులు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించారు. కేంద్రాల్లో ఉన్న వస్తువులు, పేపర్లు చిందరవందరగా పడేశారు. మంగళవారం ఉదయం వెళ్లిన సిబ్బంది.. తలుపులు ధ్వంసమై ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. రైతు సేవాకేంద్రంలో నిల్వ చేసిన కందుల బ్యాగులతో పాటు, ఓ కంప్యూటర్, కుర్చీలు అపహరించినట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చోరీకి విఫలయత్నం
గుత్తి: స్థానిక అమృత్ సినిమా థియేటర్ కాంప్లెక్స్‌లోని మూడు షాపుల్లో సోమవారం అర్దరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రామకృష్ణ దుస్తుల దుకాణం, శ్రీకాంత్ మొబైల్ షాపు, తాయి వెంకటేష్ షాపులో చోరీకి విఫలయత్నం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
చిరుత దాడిలో పొట్టేలు మృతి
బెళుగుప్ప: మండలంలోని బ్రాహ్మణపల్లి తండా సమీపంలో సోమవారం రాత్రి గడ్డి దొడ్డిలో ఉన్న పొట్టేలుపై చిరుత దాడి చేసి తినేసింది. మంగళవారం ఉదయం దొడ్డి వైపుగా వెళ్లిన రైతు కె.తిప్పేస్వామి నాయక్ గుర్తించి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పొట్టేలు మృతితో రూ.12 వేలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.