
విధుల్లోకి అరబిక్ టీచర్లు
అనంతపురం ఎడ్యుకేషన్: మైనార్టీ కేజీబీవీల్లో పని చేస్తున్న అరబిక్ టీచర్లు ఎట్టకేలకు విధుల్లోకి చేరారు. కురుగుంట, గుంతకల్లు, తాడిపత్రి, కేజీబీవీల్లో పదేళ్లుగా పని చేస్తున్న అరబిక్ టీచర్లను ఈ విద్యా సంవత్సరం నుంచి అవసరం లేదంటూ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో జిల్లాలో ఈనెల 17 నుంచి వారిని తప్పించారు. అయితే అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. పదేళ్లుగా పని చేస్తున్న తమను మౌఖిక ఆదేశాలతో తప్పించడం పట్ల అరబిక్ టీచర్లు సోమవారం ఇన్‌చార్జ్ కలెక్టర్ శివనారయణ్‌శర్మను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ అంశంపై ‘కేజీబీవీ అరబిక్ టీచర్లకు షాక్’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం కథనం వెలువబడింది. స్పందించిన సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు.. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ కేజీబీవీ సెక్రటరీ దేవానందరెడ్డితో మాట్లాడారు. స్టేట్ ఆఫీస్ నుంచి అధికారిక ఉత్తర్వులు పంపలేదని, మౌఖిక ఆదేశాలతో ఎలా తప్పిస్తారంటూ ప్రశ్నించారు. వారిని కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా సమగ్ర శిక్ష అధికారుల ఆదేశాలతో ఆయా కేజీబీవీల ఎస్‌ఓల నుంచి అరబిక్ టీచర్లకు పిలుపు వెళ్లడంతో వారు మంగళవారం మధ్యాహ్నానికి విధుల్లో చేరారు.
ఉపాధ్యాయుడి ఔదార్యం.. బడిలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు
బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంట గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అశ్వత్థనారాయణ... కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. తన మిత్రుల సహకారంతో సమీకరించిన రూ.8 లక్షలతో 20 కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను కొనుగోలు చేసి పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

విధుల్లోకి అరబిక్ టీచర్లు