
వైభవంగా మస్తానయ్య ఉరుసు
గుంతకల్లు: స్థానిక పాత గుంతకల్లు ప్రాంతంమస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున పుష్పాలతో అందంగా అలకంరించిన షంషీర్‌ను గుర్రంపై కొలువుదీర్చి మేళాతాళలతో దర్గా నుంచి గణాచారిరెడ్డి కులస్తుల ఇంటికి చేర్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరిగి దర్గాకు తీసుకువచ్చారు. వేలాది భక్తులు తరలిరావడంతో పాత గుంతకల్లు జనసంద్రమైంది. ఊరేగింపులో ఎండ కొబ్బరి కాల్చేందుకు భక్తులు ఎగబడ్డారు. చక్కెర చదివింపులు, తులభారాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం జియారత్ కార్యక్రమంతో మస్తానయ్య ఉరుసు ఉత్సవాలు ముగిస్తాయని వక్ఫబోర్డు అధికారి రహీం, దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.
ముసలమ్మ ఆలయంలో చోరీ
బుక్కరాయసముద్రం: మండల కేంద్రం సమీపంలోని ముసలమ్మ కట్ట వద్ద వెలసిన ముసలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ధర్మకర్త సుశీలమ్మ తెలిపిన మేరకు... సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి దుండుగులు చొరబడి సీసీ ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హార్డ్‌డిస్క్‌తో పాటు హుండీను ఎత్తుకెళ్లి ఆలయం వెనుక భాగాన ధ్వంసం చేసి, అందులోని నగదు, కానుకలను అపహరించారు. చోరీ సొత్తు విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వైభవంగా మస్తానయ్య ఉరుసు