
మూడు రోజులు ఇక్కడ.. మూడు రోజులు అక్కడ
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయంలో పరిపాలనా అవసరాల కోసం నలుగురు టీచర్లను తాత్కాలికంగా తీసుకున్నారు. బొమ్మనహాళ్ మండలం సింగనహళ్లి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం ఎల్.ప్రహ్లాదనాయుడు, రాయదుర్గంలో హెచ్‌ఎంగా పని చేస్తున్న నారాయణస్వామి, బ్రహ్మసముద్రంలో హెచ్‌ఎంగా పని చేస్తున్న చలపతినాయుడు, పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో ఎస్జీటీగా పని చేస్తున్న ఆంజనేయులును తాత్కాలికంగా నియమిస్తూ సమగ్ర శిక్ష డీపీసీ, డీఈఓ ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరు వారంలో మూడు రోజులు ఇక్కడ, మిగిలిన మూడు రోజులు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కీలకమైన సెక్టోరియల్ అధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పక్కన పెట్టేసి తాత్కాలికంగా టీచర్లను విధుల్లోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఏడాదిగా విద్యాభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే సెక్టోరియల్ అధికారులు లేక ‘సమగ్రశిక్ష’ నిర్వీర్యమైంది. గతేడాది జూలై 31న ఉన్న సెక్టోరియల్ అధికారులందరినీ ఒకేమారు తప్పించారు. సెక్టోరియల్స్‌ను తప్పించాలన్నా... కొత్తగా తీసుకోవాలన్నా వేసవి సెలవుల్లో మాత్రమే చేపట్టాలనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను తుంగలో తొక్కి మధ్యలోనే తప్పించడం గమనార్హం.
నోటిఫికేషన్‌కు మంగళమేనా?
‘సెక్టోరియల్’ పోస్టుల భర్తీకి గతంలో ఓసారి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు స్వీకరించి స్క్రూటినీ చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఐదుగురిని ఎంపిక చేసి జాబితాను ఆమోదం కోసం ఎస్పీడీ ద్వారా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి నలుగురికి మాత్రమే ఆమోదం దక్కింది. అయితే, తాము చెప్పిన వారిపేర్లు లేవనే కారణంగా కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసి ఆ పోస్టింగ్‌లను అడ్డుకున్నారు. చివరకు ఒక టీచరు నాట్ విల్లింగ్ ఇవ్వడం, మరొక టీచరు హెచ్‌ఎంగా పదోన్నతి రావడంతో వెళ్లిపోయారు. ఎట్టకేలకు కలెక్టర్ ఆదేశాలతో తక్కిన ఇద్దరిని మాత్రం తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా గత నెలలో ఆరు సెక్టోరియల్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేశారు. టీచర్ల నుంచి 172 దరఖాస్తులూ వచ్చాయి. వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటిదాకా కనీసం స్క్రూటినీ కూడా చేయలేదు. వాస్తవానికి ఎంపిక ప్రక్రియ కూడా సెలవుల్లోనే పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ కనీస చర్యలకు నోచుకోలేదు. ప్రజాప్రతినిధులపై వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే వాటి జోలికి వెళ్లకుండా... ‘తాత్కాలికంగా పని కానిద్దాం’ అనే ఆలోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ నోటిఫికేషన్‌కు కూడా మంగళం పాడేలా ఉన్నారంటూ పలువురు టీచర్లు చర్చించుకుంటున్నారు.
‘తాత్కాలికం’గా సమగ్రశిక్ష కార్యక్రమాల పర్యవేక్షణకు నలుగురు టీచర్లు
సెక్టోరియల్ పోస్టుల భర్తీని
పట్టించుకోని అధికారులు