
కక్షతోనే మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు
రాయదుర్గం: వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి సర్కార్ కక్షతోనే అక్రమ కేసు బనాయించిందంటూ వైఎస్సార్ సీపీ రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ‘మెట్టు’ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. మద్యం కుంభకోణం అంటూ నానా యాగీ చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులు కనిపిస్తున్నాయన్నారు. బిహార్ రాష్ట్రం కంటే అధ్వానంగా ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందన్నారు. హామీలు గాలికొదిలి ప్రజాసంక్షేమాన్ని అటకెక్కించారని దుయ్యబట్టారు. హామీలివ్వడం తర్వాత గాలికొదలడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఏ హామీలిచ్చారు.. వాటిలో ఎన్ని నెరవేర్చారనే విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ కార్యకర్తల పై ఉందన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నందుకే ప్రజలు కూటమికి ఓట్లేశారని, కానీ నేడు వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడేది లేదని, అందరికీ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరాళ్ల శివకుమార్, పట్టణ, రూరల్, డి హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్ మండల కన్వీనర్లు మేకల శ్రీనివాసులు, రామాంజినేయులు, రవీంద్రనాథ్‌రెడ్డి, బ్రహ్మనందరెడ్డి, రామాంజినేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, పార్టీ జిల్లా నేత వీరన్న, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కేపీదొడ్డి రమేష్ పాల్గొన్నారు.