
విధుల్లోకి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
కూడేరు: శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె విరమించి మంగళవారం విధుల్లోకి చేరారు. పీఏబీఆర్‌లోని శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో మోటర్ స్విచ్ ఆన్ చేసి తాగునీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎప్ చెల్లించాలంటూ కార్మికులు సాగించిన 100 రోజుల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. కాంట్రాక్టర్ శివారెడ్డి తమతో జరిపిన చర్చల్లో బుధవారం సాయంత్రంలోపు కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి వేతనలు, పీఎఫ్ జమవుతాయని హామీనిచ్చారన్నారు. ఇందుకు కార్మికులు సమ్మతించి విధుల్లోకి చేరారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, ప్రాజెక్ట్ యూనియన్ నేతలు ఎర్రిస్వామి, రామాంజనేయులు, ఈశ్వరయ్య, నాగరాజు, చిక్కన్న తదితరులు పాల్గొన్నారు.
పంటలకు బీమా తప్పనిసరి
బుక్కరాయసముద్రం/రాప్తాడు: సాగు చేసిన పంటలకు బీమా తప్పని సరిగా చేయించుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ) ఉమామహేశ్వరమ్మ సూచించారు. బీకేఎస్ మండలం కొర్రపాడు, రాప్తాడు మండలం మరూరు, హంపాపురం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. పత్తి, వేరుశనగ, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటి సాగు చేసిన రైతులు పంటల భీమా ప్రీమియంను మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించాలన్నారు. పత్తికి ఎకరాకు రూ.1,140, వేరుశనగకు రూ.640, దానిమ్మకు రూ.3,750, బత్తాయికి రూ.2,750, టమాటకు రూ.1,600, అరటికి రూ.3 వేలు చొప్పన ప్రీమియం చెల్లించాలన్నారు. కౌలు రైతులు పంటల సాగు హక్కు పత్రాలను తప్పనిసరిగా పొందాలన్నారు. పంట పొలాల్ని ఆశించే చీడపీడలు, వివిధ రకాల తెగుళ్లు, యాజమాన్య పద్ధతులను వివరించారు. రాయితీ విత్తనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేరుశనగ సాగు చేసే ప్రతి రైతూ అంతర పంట వేసుకోవాలన్నారు. కంది, ఆముదం సాగు విస్తీర్ణం పెంచుకుంటే మంచిదన్నారు. కార్యక్రమంలో బీకేఎస్, రాప్తాడు మండల వ్యవసాయాధికారులు శ్యాం సుఽందరరెడ్డి, కృష్ణచైతన్య, పట్టు పరిశ్రమ అధికారి రమాకాంత్, చంద్రశేఖర్, వీఆర్‌ఓ నాగరాజు, నరేంద్రరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

విధుల్లోకి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు