
వేపలపర్తిలో ప్రబలుతున్న అతిసారం
రాయదుర్గం టౌన్: బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామంలో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. గ్రామానికి చెందిన నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ సోమవారం ఇద్దరు మహిళలు, మంగళవారం సాయంత్రం మరో ఇద్దరు మహిళలు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి చేరారు. బాధితుల్లో లీలావతి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు.
నీట మునిగి
ఇద్దరు రాజస్థానీల మృతి
కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీట మునిగి రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన జుట్టూ(22), భగత్‌సింగ్(25), సురేష్ బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం వలస వచ్చి ఉడ్‌వర్క్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలోని వెంకటేష్ బాబు తోటలోకి వెళ్లి, అక్కడ బొప్పాయి పండ్లను ఆరగించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జుట్టూ కాలు జారి ట్యాంక్‌లో పడ్డాడు. గమనించిన భగత్‌సింగ్ వెంటనే ట్యాంక్‌లోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. సురేష్, స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పంచాయతీల పురోగతి సూచికపై నేడు శిక్షణ
అనంతపురం సిటీ: పంచాయతీల పురోగతి సూచిక 2.0 అంశంపై అనంతపురంలోని డీపీఆర్‌సీ భవన్‌లో ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణా తరగతులకు ఉమ్మడి జిల్లాలోని అధికారులు హాజరు కానున్నారు. ఒక్కో మండలం నుంచి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ శిక్షణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అన్ని మండలాల అధికారులకు పంపినట్లు జెడ్పీ వర్గాలు వెల్లడించాయి.