
18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం పరికరాలు
● డీసీఓల సమావేశంలో పీడీ రఘునాథరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది 18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను రైతులకు సకాలంలో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. అయితే పరికరాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో కంపెనీ డీసీఓలు, మైక్రో ఇంజనీర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. గతేడాదిలో ఏవైనా పెండింగ్‌లో ఉంటే వారం రోజుల్లో పూర్తి చేసి పంపాలన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే 1,359 హెక్టార్లకు కేటాయించిన యూనిట్లను సరఫరా చేసి సంబంధిత పొలాల్లో బిగించే (ఇన్‌స్టాలేషన్) పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏపీడీ ధనుంజయ, ఏడీహెచ్‌లు దేవానంద్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీ ప్యాట్‌లో
ఓటీపీఆర్‌ఐ విద్యార్థుల సత్తా
అనంతపురం: జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో జేఎన్‌టీయూ(ఏ) ఓటీపీఆర్‌ఐ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో గణనీయమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు డి.హేమంత్‌కుమార్ (204 ర్యాంకు ), కె.గురుచరణ్ (2,484), జి.దేవీప్రియ (3,828), ఎస్.కుష్వంత్ (4,058)ను ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ చక్కా గోపీనాథ్ అభినందించారు.