
రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి
పామిడి: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారి శివకార్తీక్‌రెడ్డితో సమీక్ష నిర్వహించారు. సర్జికల్ ప్రొసీజర్స్‌పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నెలకు 30 ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్పెషలాఫీసర్లు ఆసుపత్రి వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్, తహసీల్దార్ ఆర్.శ్రీధరమూర్తి, డాక్టర్ మహేష్, హెడ్ నర్స్ శివకుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
అనంతపురం అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణ దినోత్సవం థీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమేనన్నారు. ఈ క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుకు కార్యాచరణ తయారు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై శనివారం గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25న వ్యర్థాల విభజన, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రచారం చేయాలన్నారు. ఇలా జూన్ 4 వరకు నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, రేంజ్ అటవీ అధికారి శ్రీనివాసులు, పీఆర్ డీఎల్‌పీఓ విజయ్‌కుమార్, డీపీఆర్‌సీ రీసోర్స్ పర్సన్ మాధవి, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుతోనే సమగ్రాభివృద్ధి
పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా నిర్ణీత గడువులోపు మంజూరు చేయాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద లబ్ధిదారుల రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి శిక్షణ, రుణం మంజూరుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిని ఆదేశించారు. బనానా ఫైబర్‌తో బ్యాగ్‌లు, టోపీలు తయారు చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌హెచ్‌జీ సభ్యులకు, రైతులకు పీఎంఈజీపీ కింద రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇండస్ట్రియల్ డెలప్‌మెంట్ పాలసీ కింద 21 యూనిట్లకు రూ.62.86 లక్షల సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసయాదవ్, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధికారి ప్రతాప్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.