
కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి
● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్
గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వేరుగా స్థానిక రైల్వేస్టేషన్‌లోని 6–7 నంబర్లు ప్లాట్‌ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌రును బ్లాక్‌లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాకుండా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్‌పీఎఫ్‌పై అధికారి అనుమతితో వారిని స్టేషన్‌లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్‌ఎండీ గౌస్ పాల్గొన్నారు.