
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
అనంతపురం అర్బన్: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ శుక్రవారం తెలిపారు. కంట్రోల్ రూమ్ 24, 25 తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 85002 92992 (వాట్సాప్), 08554– 220009ను సంప్రదించవచ్చని తెలిపారు.
చుక్కల భూములకు పరిష్కారం
అనంతపురం అర్బన్: నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అధికారులు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కళ్యాణదుర్గం డివిజన్‌కు సంబంధించి డీఎల్‌సీ, డీఎల్‌ఎన్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను తొలగించేందుకు ప్రతి వారం షెడ్యూల్ ప్రకారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి ఒక కేసును విచారించి ఆమోదించామన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లతో ఆర్డీఓ పని చేయించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సెక్షన్ వారీగా ఫైళ్లు ఎన్ని పంపారు. ఎన్ని పరిష్కరించారనేది తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ భాస్కర్, మునిసిపల్ కమిషనర్ వంశీకృష్ణ, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ ప్రభంజన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అనంతపురం అర్బన్: చౌక ధరల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్‌శర్మ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అంశాలపై జేసీ శుక్రవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా చేస్తున్న వారిపై 6ఏ కేసు నమోదు చేయాలన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకుని అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం మేరకు కేసు పెట్టడంతో పాటు రౌడీ షీట్ తెరవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను తూనికలు కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. చౌక దుకాణాలను ఆర్డీఓలు, తహసీల్దారులు, సీఎస్‌డీటీలు, డీఎస్‌ఓ తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్డుదారుల ఈ–కేవైసీ పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.