
విద్యాశాఖలో ఏమి జరుగుతోంది?
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను గతంలో ఎప్పుడూ లేనివిధంగా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అత్యంత రహస్యంగా నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని శారదా బాలికల పాఠశాలలో డీఈఓ ప్రసాద్‌బాబును నిలదీశారు. ఇంత గోప్యతగా ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీల వారీగా మార్కులు, మెరిట్ ర్యాంకుల వివరాలు తెలియజేయాలని మూన్నెళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటిదాకా బయటకు పెట్టకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంకులు, మార్కులు బయటకు చెప్పకుండా తాము ఇచ్చిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అడిగితే ఎలా చెప్పాలని ప్రశ్నించారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సీనియార్టీ జాబితాలు విడుదలవుతున్నా ఇక్కడ మాత్రం ఏఒక్కటీ చెప్పడం లేదన్నారు.
సంఘాలకు చెప్పకూడదనుకుంటున్నారా?
బదిలీలకు సంబంధించిన అనేక సందేహాల నివృత్తి కోసం డీఈఓకు వందలసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండి పడ్డారు. బదిలీలకు సంబంధించి రాష్ట్ర అధికారుల నుంచి రోజూ నాలుగైదుసార్లు వెబెక్స్‌లు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నా ఏఒక్కటీ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పడం లేదన్నారు. ‘అన్నీ ఎంఈఓలకు పంపుతున్నామంటున్నారు. అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పకూడదనుకుంటున్నారా’ అని ప్రశ్నించారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చించకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన డీఈఓ...ఇకపై టీచర్లకు సంబంధించిన ప్రతి సమాచారం సంఘాల నాయకుల వాట్సాప్ గ్రూపులోనూ పెడతామన్నారు. సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ నాయక్, రామాంజనేయులు, సూరీడు, సిరాజుద్దీన్, రమణారెడ్డి, ఎర్రిస్వామి, వెంకటరత్నం, శ్రీనివాస్ రెడ్డి, రాయల్ వెంకటేష్, లింగమయ్య, నరసింహులు, కులశేఖర్‌రెడ్డి, హనుమేష్. వెంకటసుబ్బయ్య, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓను నిలదీసిన నాయకులు