
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చ ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారనే విషయంపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏపీ ఈసెట్‌లో
91.71 శాతం ఉత్తీర్ణత
అనంతపురం: ఏపీ ఈసెట్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌కు మొత్తం 2,538 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,448 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,245 మంది అర్హత మార్కులు సాధించారు. బాలురు 1,735 మంది దరఖాస్తు చేసుకోగా 1,668 (91.25శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 1,522 మంది అర్హత సాధించారు. బాలికలు 803 మంది దరఖాస్తు చేసుకోగా, 780 మంది పరీక్ష రాశారు. 723 (92.69 శాతం) మంది అర్హత సాధించారు.
రాయలచెరువు విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
యాడికి: ఈసెట్ ఫలితాల్లో మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన టోపీఖాన్ కుమారుడు రఖీబ్ ఖాన్ సత్తా చాటాడు. 200 మార్కులకు 96 మార్కులు సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలిచాడు. విద్యార్థి రఖీబ్ ఖాన్‌ను స్థానికులు అభినందించారు.
గవర్నర్ పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఈనెల 17న జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయనున్నారు. ఆ రోజున గవర్నర్ విడిది చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అతిథి గృహంలోని గదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిథి గృహం పరిశుభ్రంగా ఉండా లని, ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సోఫాలు, ఫర్నీచర్, ఏసీలు మరమ్మతు చేయించాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలని, అతిథి గృహాన్ని ఒక రోజు ముందే ఆధీనంలోకి తీసుకోవాలని టూటౌన్ సీఐ శ్రీకాంత్‌కు చెప్పారు. లైజనింగ్ అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులెవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్‌డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మెహన్, ఆర్‌అండ్‌బీ డీఈఈ కాటమయ్య, పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ జగన్మో హన్‌రావు, తహసీల్దార్లు హరికుమార్, బ్రహ్మయ్య, రియాజ్‌బాషా, ఆర్‌ఐ సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంటెక్, ఫార్మాడీ
ఫలితాల విడుదల
అనంతపురం: ఎంటెక్, ఫార్మాడీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మార్చిలో నిర్వహించిన ఫార్మాడీ, ఎంటెక్ నాలుగో సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్‌టీయూ(ఏ) వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

21న జెడ్పీ సర్వసభ్య సమావేశం

21న జెడ్పీ సర్వసభ్య సమావేశం