
లోదుక్కులతో లాభాలెన్నో..
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వేసవిలో లోతుగా దుక్కులు చేసుకుంటే ఖరీఫ్ పంటలకు చాలా మేలు జరుగుతుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు మందుస్తు సేద్యపు పనులు చేసుకోవాలన్నారు. అందులో భాగంగా పొలాల్లో వాలుకు అడ్డంగా దున్నడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి సేద్యపు పనులు చేసుకోవాలని సూచించారు.
75 శాతం వర్షాధారం
జిల్లాలో 75 శాతం విస్తీర్ణం వరకు వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా లేదంటే ఆలస్యం కావడం.. త్వరగా నిష్క్రమించడం.. తక్కువ వర్షాలు కురవడం.. అనిశ్చితి వర్షాలు.. పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం.. ఒక్కోసారి విరామం లేకుండా అతివష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం, ఒరవడి రూపంలో బయటకు వెళ్లి వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహం రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి.
లోదుక్కులతో విస్తృత ప్రయోజనాలు
వేసవిలో కురిసే ఇలాంటి వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్రనేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్నే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా కోశస్థ దశలో ఉన్న పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకు నశిస్తాయి. వచ్చే పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. భూమి గుల్లబారిపోతుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా కొంతకాలం పాటు పంటలను కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. కలుపు సమస్య కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా గాలిలో నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇలా విత్తనం వేయడానికి ముందుగా రెండు మూడు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
శాస్త్రవేత్తలు విజయ శంకరబాబు, నారాయణస్వామి సూచనలు

లోదుక్కులతో లాభాలెన్నో..