
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకరన్ తదితరులు ఉన్నారు.
ముందుగానే ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్రన్ మాన్‌సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి.
ఖరీఫ్‌కు కీలకం..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు.