
టీడీపీ నేతల పరస్పర దాడులు
తాడిపత్రి: ఓ వివాహ వేడుకలో టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. సజ్జలదిన్నెకు చెందిన టీడీపీ నేత దుబ్బన్న బంధువు కుమారుడి వివాహ వేడుక సంద్భంగా గ్రామంలో శనివారం రాత్రి మెరవణి చేపట్టారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ ప్రముఖుడు సుబ్బయ్య ఇంటి ఎదురుగా మెరవణి వెళుతున్న సమయంలో బాణాసంచా పేల్చేందుకు దుబ్బన్న వర్గీయులు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని సుబ్బయ్య అడ్డుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో బాణాసంచా కాల్చరాదని సూచించాడు. దీంతో దుబ్బన్న వర్గీయులు రెచ్చిపోయి సుబ్బయ్యతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో ఇరువర్గాలకు చెందిన పలువురు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో సుబ్బయ్య వర్గానికి చెందిన రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పార్టీ ఆఫీస్‌లోనే ..
గుత్తి: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీకి చెందిన సీనియర్ నేత కోనంకి కృష్ణ కార్యాలయంలో ఇతర నాయకులతో కలిసి సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తుండగా అక్కడకు తన అనుచరులతో కలసి చేరుకున్న టీడీపీ నేత వాసు (జీఆర్పీ కానిస్టేబుల్).. సంస్థాగత ఎన్నికల్లో తన అనుచరులు ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై కోనంకి కృష్ణ అభ్యంతరం తెలపడంతో వాసుతో పాటు అతని అనుచరులు బూతులతో రెచ్చిపోతూ దాడికి ప్రయత్నించారు. అక్కడున్నవ ఆరు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం తనపై జరిగిన దాడిపై తీసిన వీడియోను కోనంకి కృష్ణ విడుదల చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

టీడీపీ నేతల పరస్పర దాడులు