
18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు
● విజయవంతం చేయాలని ఈఓ పిలుపు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈఓ కె.వాణి పిలుపునిచ్చారు. ఆలయ సిబ్బందితో కలిసి శనివారం ఆమె హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈఓ మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాలు ఈ నెల 22 వరకు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న స్వామివారికి పుష్పాలంకరణసేవ, ఉత్సవ మూర్తికి తులసీదళంతో లక్షార్చన పూజ, 19న స్వామివారికి డ్రైఫ్రూట్స్‌తో అలంకరణ, ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన, 20న స్వామివారి శ్రీగంధాలంకరణ సేవ, ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన, 21న 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల ఫలాలతో అలంకరణ, ఉత్సవమూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. చివరి రోజు ఈ నెల 22న స్వర్ణవజ్రకవచ అలంకరణలో స్వామివారిని తీర్చిదిద్ది, తోమాలతో విశేష పుష్పాలంకరణ, ఉదయం 9 గంటలకు శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగస్తాయని తెలిపారు.
బాలుడిపై కుక్కదాడి
యల్లనూరు: మండల కేంద్రంలో గురు ప్రజ్వల్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. పాతపేటలోని రజక వీధిలో నివాసముంటున్న కొప్పేల గురుస్వామి, నాగమ్మ దంపతుల కుమారుడు గురు ప్రజ్వల్. తల్లి శుక్రవారం రాత్రి అన్నం తినిపిస్తుండగా ఇంటి ఆవరణలో ఉన్న కుక్క ఒక్కసారిగా ప్రజ్వల్‌పై దాడిచేసింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు