
పత్రికా స్వేచ్ఛపై పోలీసుల దాడి దుర్మార్గం
‘జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం సిగ్గుచేటు’
అనంతపురం కల్చరల్: కక్షపూరితంగానే సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు అవమానించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి వారెంట్లు లేకుండా సోదాలు చేపట్టడం పోలీసు ప్రతిష్ట దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వాస్తవాలను ప్రచురించకుండా భయపెడుతున్న ప్రభుత్వ విధానాలు అభ్యంతరకరమన్నారు. న్యాయస్థానం సుమోటోగా కేసు స్వీకరించి, పోలీసు అధికారులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టానికి, న్యాయనికి విలువలు లేని రోజులు వచ్చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను, పత్రికా స్వేచ్ఛను మంటకలుపుతున్న విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారన్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం అత్యంత దుర్మార్గమని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసులు చేపట్టిన తనిఖీలను తప్పుబట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచే కథనాలు ప్రచురించే మీడియాపైనే ఇంతకు దిగజారితే... ఇక ప్రశ్నించే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాలను సాక్షి పత్రిక రోజూ అనేక కథనాలతో వెలుగులోకి తెస్తోందన్నారు. వాస్తవాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంపై పోలీసులతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నిజాలు వెలుగులోకి రానీయకుండా గొంతునొక్కే ప్రయత్నంగానే దీనిని భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా పోలీస్ అధికారులు రాజ్యాంగం, చట్ట ప్రకారం వ్యవహరించకపోతే ప్రజల తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శి సురేష్