
ప్రమాదంలో వ్యక్తి మృతి
గార్లదిన్నె: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య (46)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కోటంకలో జరిగిన బంధువుల ఇంట శుభకార్యానికి హాజరైన ఆయన కార్యక్రమం ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. స్వగ్రామానికి చేరువకాగానే ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి కిందపడడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపారు.
దళిత రైతుల పురోగతికి
సాంకేతిక పరిజ్ఞానం
అనంతపురం: జిల్లాలోని దళిత రైతుల పురోగతికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నిర్వహణను జేఎన్‌టీయూ(ఏ) దక్కించుకుంది. డిపార్ట్‌మెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీకి చెందిన సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్) విభాగం ద్వారా అమలవుతున్న ఎస్సీ (షెడ్యూల్ కాస్ట్) హబ్ కింద రూ.47,62,047 నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్‌రెడ్డి, కెమికల్ విభాగం ప్రొఫెసర్ బి.దిలీప్‌కుమార్, ఎలక్ట్రికల్ విభాగం డాక్టర్ జి. మమత నిర్వహించనున్నారు. మూడేళ్ల గడువున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేరుశనగ ద్వారా నూనె, స్నాక్స్, టమాట ద్వారా సాస్, డ్రై టమాట వంటి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రైతులకు మార్కెట్ లింకేజీలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తుల బ్రాండింగ్ వంటి అంశాలపై మద్దతునివ్వనున్నారు. ప్రత్యేకంగా దళిత రైతులకు నైపుణ్య శిక్షణా శిబిరాలు, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, మార్కెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా పరిశోధక బృందాన్ని శుక్రవారం జేఎన్‌టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు అభినందించారు.