
తిరునాలలో అపశ్రుతి
పెద్దవడుగూరు: బండిశూల తిరునాలలో అపశ్రుతి చోటు చేసుకొంది. వివరాలు.. గురువారం గుత్తి అనంతపురం, కాశేపల్లి మీదుగా పామిడి మండలం రామరాజు పల్లి వరకూ ఎద్దులతో సురబండిని లాగే కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కాడిమానుపై కూర్చొని ఎద్దులను తోలుతుండగా జి. వెంకటాంపల్లికి చెందిన సిద్దపు రాజు అదుపు తప్పి కింద పడ్డాడు. పాదాలపై బండి చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సల కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పెద్దవడుగూరుకి చెందిన రైతులు తమ ఎద్దులను సురబండి లాగడానికి కట్టారు. ఈ క్రమంలో ఉన్నఫలంగా ఎద్దుల పట్టెడు తెగిపోయింది. అక్కడే ఉన్న రైతు నాగభూషణ ఎద్దును కట్టడి చేయడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసింది. క్షతగాత్రుడికి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.