
గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
వజ్రకరూరు: స్థానిక ఎస్‌బీఐ అధికారుల తీరును నిరసిస్తూ బ్యాంక్ ఎదుట గురువారం ఓ గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండాకు చెందిన హేమ్లనాయక్, సాలమ్మ దంపతులు తమకున్న 1.47 ఎకరాల భూమిలో పంటల సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్‌బీఐలో రూ.51వేల పంట రుణాన్ని పొందారు. రెండేళ్ల క్రితం సాలమ్మ మృతి చెందింది. ఆమె పేరుమీద తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి రూ.71,131 అయిందని, ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బుధవారం సాయంత్రం హేమ్ల నాయక్ బ్యాంక్ అధికారులను కలసి డెత్ సర్టిఫికెట్ అందజేసి, మాట్లాడాడు. దీంతో సాలమ్మ ఖాతాలో ఉన్న రూ.21,600 ఆమె పేరుతో ఉన్న పంట రుణానికి బ్యాంక్ అధికారులు జమ చేశారు. విషయం తెలుసుకున్న హేమ్ల నాయక్ గురువారం బ్యాంక్ అధికారులను కలసి మాట్లాడాడు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపం చెంది బ్యాంక్ ఎదుట పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ నాగస్వామి వెంటనే పురుగుల మందు డబ్బా లాక్కొని న్యాయం జరిగేలా చూస్తానని భరోనివ్వడంతో రైతు శాంతించాడు.