
తాడిపత్రి వెళ్తున్నా.. భద్రత కల్పించండి
అనంతపురం: హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 8న కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వెళ్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని డీఐజీ, ఎస్పీకి విన్నవించారు. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డితో కలిసి పెద్దారెడ్డి మంగళవారం డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ జగదీష్‌కు అందజేశారు. అనంతరం పెద్దారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రెండు దఫాలు జిల్లా ఎస్పీని కలిశామన్నారు. కప్పదాటు వైఖరి అవలంబిస్తూ తాను తాడిపత్రి వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 8న తాడిపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, భద్రత నడుమ తాడిపత్రికి పంపేలా న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, మహిళా విభాగం అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శోభా భాయి, నగర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రసన్న లక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఐజీ, ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే
కేతిరెడ్డి పెద్దారెడ్డి వినతి