
రఘువీరారెడ్డి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరా
మడకశిర రూరల్: కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సమ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మడకశిర మండలం నీలకంఠాపురంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కులగణనపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. దాని ఫార్మెట్ తయారీపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు లోకసభ, రాజ్యసభల్లో చర్చించాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కులగణన సర్వే ఆరు నెలల్లోనే పూర్తి చేసి వివరాలు ప్రకటించాలన్నారు. కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఒత్తిడి తేవడంతోనే కులగణనకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కులగణన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేసేలా చూడాలన్నారు. కులగణన పూర్తయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెరిగి న్యాయం జరుగుతుందన్నారు.
315 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గార్లదిన్నె: మండలంలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా తరలిస్తున్న 315 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గార్లదిన్నె తహసీల్దార్ ఈరమ్మ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అక్బర్ బాషా, క్లీనర్ సుబ్బరాయుడుపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఆత్మకూరు స్టాక్ పాయింట్‌కు తరలించామన్నారు.
రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియాన్ని రాప్తాడు మండలం మరూరు టోల్ ఫ్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు రాప్తాడు తహసీల్దార్ విజయకుమారి తెలిపారు. సోమందేపల్లికి చెందిన రవికుమార్ అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి, కర్నాటకలోని పావగడకు తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.
లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో ఎస్పీ
ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామిని ఎస్పీ జగదీష్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. విశేష పూజల అనంతరం స్వామి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు.
అప్పు చెల్లించమంటే దాడి చేశారు!
యల్లనూరు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరిన వ్యక్తిపై రుణ గ్రహీత దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు...యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామానికి చెందిన శ్రీరంగనాయకులు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నిమ్మకాయల రామాంజనేయులుతో రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ సోమవారం రాత్రి శ్రీరంగనాయకులును ఆయన ఇంటి వద్దకెళ్లి రామాంజనేయులు అడిగాడు. దీంతో శ్రీరంగనాయకులు, ఆయన కుమారులు రమేష్, రంగ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామాంజనేయులుపై ఇనుప పైపులతో దాడి చేశారు. ఘటనలో తలకు తీవ్ర గాయమైన రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.