
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడేగాని చెట్లను తొలగించరాదన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలనన్నారు. అనవసరంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయరాదన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలోని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 మంది ఆయకట్టుదారులు, సభకు మూడు వేల మంది మాత్రమే వచ్చేలా చూడాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో గ్రామానికి చెందిన వారు మాత్రమే ఉండాలన్నారు. హెలిప్యాడ్, కాన్వాయ్, సభాప్రాంగణం, తదితర ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
బంగారు గొలుసు అపహరణ
కళ్యాణదుర్గం రూరల్: బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న బంగారు గొలుసును దుండగుడు అపహరించిన ఘటన కళ్యాణదుర్గంలో వెలుగు చూసింది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం శిర్పి గ్రామానికి చెందిన మౌనిక, నవీన్ దంపతులు కర్ణాటకలోని పెద్దపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమై మంగళవారం ఉదయం కళ్యాణదుర్గంలోని బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు ఎక్కి కూర్చొన్న అనంతరం తన హ్యాండ్ బ్యాగ్‌ను మౌనిక పరిశీలించారు. అందులో ఉంచిన నాలుగు తులాల బంగారు చైన్ కనిపించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.