
ప్రహసనంలా ‘పోలీసు గ్రీవెన్స్’
అనంతపురం: తమకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులే. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. అన్యాయం జరిగిన వెంటనే బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం దక్కక అయోమయంలో ఉన్న బాధితులు నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే... వాటిలో 50శాతం పిటిషన్లను గ్రీవెన్స్ పరిధిలోకి రావని తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఈ గందరగోళం మధ్యనే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులపైనే పోలీసులు రివర్స్ కేసులు బనాయిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
వెల్లువలా వినతులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో బాధితులు ఎంతో వ్యయప్రయాసలకొర్చి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ వినతుల్లో సైతం పరిష్కారం దక్కేది ప్రశ్నార్థకమై ‘నేతి బీరలో నెయ్యి...’ అనే చందంలా మారింది.
74 అర్జీలు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 74 వినతులు అందాయి. అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్. మహబూబ్ బాషా పాల్గొన్నారు.
ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయని వైనం
బాధితులపైనే రివర్స్ కేసులతో సతాయింపు
పోలీసు వ్యవస్థపై సన్నగిల్లుతున్న నమ్మకం