
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డొకాయ్ ఆపరేషన్లు చేపట్టి లింగ నిర్ధారణ స్కానింగ్‌లకు పాల్పడుతున్న సెంటర్లపై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. అలాగే లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘనకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశంపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పెథాలజిస్టు డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు.
64 గ్రామాల్లో రక్తపూతలు సేకరించాలి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో దోమకాటు వ్యాధులు అధికంగా నమోదవుతున్న 32 మండలాల్లోని 64 గ్రామాల్లో పైలేరియా వ్యాధిని గుర్తించేందుకు రక్తపూతల సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను డీఐఓ ఓబులు ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినంలో భాగంగా ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ మలేరియా సబ్ యూనిట్ అధికారులు మద్దయ్య, మునాఫ్, బత్తుల కోదండరామిరెడ్డి, తిరుపాల్, నాగేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి