టీడీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
● కుమారుడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని
తొలగించారని అఘాయిత్యం
● డబ్బు ముట్టజెప్పినా.. మరొకరితో
మళ్లీ వసూలు చేసి అన్యాయం చేశారు: బాధిత కుటుంబీకుల ఆరోపణ
గుత్తి రూరల్: డబ్బు ముట్టజెప్పి కుమారుడికి ఇప్పించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని.. వేరొకరితో మళ్లీ వసూళ్లకు పాల్పడి తొలగించారని మనస్తాపం చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని మాముడూరు గ్రామంలో కలకలం రేపింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..మామడూరుకు చెందిన బోలే ఎల్లప్ప టీడీపీలో చాలాకాలంగా చురుగ్గా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎల్లప్ప కుమారుడు బోలే గిరిష్‌ని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఇందుకోసం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, అప్పటి గుత్తి పార్టీ ఇన్‌చార్జ్ గుమ్మనూరు నారాయణ రూ.4 లక్షలు తీసుకొన్నారు. ఇటీవల నారాయణ స్థానంలో గుత్తి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి బోలే గిరిష్‌ని తొలగించి అదే గ్రామానికి చెందిన మరొకరిని నియమించారు. ఇందుకు ఆయన రూ.8 లక్షలు తీసుకొన్నారు. తన కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఎల్లప్ప అవమానంగా భావించాడు. ఆదివారం తన భార్య లక్ష్మిదేవి, గ్రామంలోని సన్నిహితులు, ఇతర పార్టీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. ఈ క్రమంలోనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కొన ఊపిరితో ఉన్న ఎల్లప్పను కిందికి దించి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


