రౌడీషీటర్ బరితెగింపు
● రస్తా విషయంలో తప్పుడు ఫిర్యాదు
● దళితుడిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు
● నిన్ను నరికితే దిక్కెవడంటూ ఖాకీల సమక్షంలోనే బెదిరింపు
● బాధితుడి ఫిర్యాదుతో 20 రోజుల తర్వాత రౌడీషీటర్‌పై కేసు నమోదు
తాడిపత్రిటౌన్(యాడికి): అధికారం మాది.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికితే దిక్కెవడంటూ ఓ దళితుడిని స్టేషన్‌లోనే బెదిరించిన టీడీపీకి చెందిన రౌడీషీటర్‌పై ఫిర్యాదు చేసిన 20 రోజుల తర్వాత యాడికి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికి మండలం పచ్చారుమేకలపల్లికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ పరిమి చరణ్ రస్తా విషయంలో గత మార్చి 19న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు విచారణ నిమిత్తం ఆదినారాయణను స్టేషన్‌కు పిలిపించారు. పోలీసుల ఎదుటే రౌడీషీటర్ రెచ్చిపోయాడు. కులం పేరుతో దూషిస్తూ ‘అధికారం మాదే.. నిన్ను ఇక్కడే (పోలీస్‌స్టేషన్ ముందే) ముక్కలు ముక్కలుగా నరికితే నీకు దిక్కెవడు’ అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయమై బాధితుడు ఆదినారాయణ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. అయితే ఆ రౌడీషీటర్‌పై కేసు మాత్రం నమోదు చేయలేదు. ఇదే విషయంపై ఈ నెల 4న రెండోసారి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తనకు న్యాయం చేయాలని తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరికి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు యాడికి పోలీసుల తీరునూ విన్నవించాడు. ఏఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేయాలని యాడికి పోలీసులను ఆదేశించారు. అయితే సీఐ ఈరన్న, ఎస్‌ఐ రమణలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చారని బాధితుడు ఆదినారాయణ వాపోయాడు. 20 రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో రౌడీషీటర్‌కు సహకరించే ధోరణి వీడకుంటే స్టేషన్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతానని సీఐకి తెలిపారు. దీంతో బాధితుడి నుంచి బుధవారం రాత్రి మరోసారి ఫిర్యాదు తీసుకుని రౌడీషీటర్ పరిమి చరణ్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు.


