
బూటు కాలితో తన్ని.. గొంతు నులిమి
అనంతపురం: బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన ఓ తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు. రాక్షసుడిలా మారి అభంశుభం తెలియని చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడు. అనంతపురం వన్‌టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన శివ, మౌనికలు కులాంతర వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అనంతపురానికి వచ్చి జేఎన్‌టీయూ (ఏ) ఎదురుగా ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌లో వంట మనుషులుగా చేరారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి హాస్టల్లో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తోందన్న కోపంతో తండ్రి శివ మంగళవారం విచక్షణారహితంగా కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. చెంప పగులకొట్టడమే కాకుండా బుగ్గలు గట్టిగా కొరికాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెట్టాడు. దెబ్బలు తాళలేక చిన్నారి ఆర్తనాదాలు పెడుతున్నా కనికరం చూపలేదు. సొమ్మసిల్లిపడిపోయినా ఆపకుండా మరీ చితకబాదాడు. ఈ విషయాన్ని హాస్టల్‌లో ఉంటున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఐసీడీఎస్ అధికారులు హాస్టల్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మూడేళ్ల చిన్నారిపై
కసాయి తండ్రి కర్కశత్వం
కేసు నమోదు చేసిన పోలీసులు