● కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు
బిల్లే మంజునాథ్ పిలుపు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో కురుబలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లి అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుబలు మద్దతుగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని, వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు బిల్లే మంజునాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు ఇటీవల హత్య చేశారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని హతుడి కుమారుడు మీడియా ముందు బహిర్గతం చేశారని గుర్తు చేశారు. ఆ కుటుంబానికి కురుబలందరూ అండగా నిలవాలన్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్ జగన్ రానున్నారని, కురుబలు పెద్ద ఎత్తున పాపిరెడ్డిపల్లికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కురుబల మీద ఎలాంటి దాడులు జరగకుండా అందరూ ఐక్యంగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కురుబలు వైఎస్సార్‌సీపీకి పూర్తిస్థాయిలో మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కూడేరు: ఉత్తీర్ణతపై అనుమానంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం జయపురం గ్రామానికి చెందిన మదన్‌మోహన్, సునీత దంపతులకు కుమార్తె అర్చన (16), ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అర్చన ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. పరీక్షలు సక్రమంగా రాయలేకపోయానని, ఫెయిల్ అవుతానంటూ తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన అర్చన... ఆదివారం వేకువజామున ఇంట్లోనే బాత్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి దుర్మరణం
గుత్తి: ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రమణ, సుజాత దంపతుల చిన్న కుమారుడు విజయ్ రాఘవేంద్రగౌడ్ (19) ఆదివారం ఉదయం చెర్లోపల్లి గ్రామ సమీపంలో నుంచి ఎరువును తరలించేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ట్రాలీలోకి ఎరువు లోడు చేస్తుండగా హైడ్రాలిక్ లిఫ్ట్ పనితీరును పరిశీలించాడు. లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో కిందకు సరి చేస్తుండగా ఉన్నఫళంగా ట్రాలీ కిందకు దిగింది. దీంతో ట్రాలీ కింద చిక్కుకున్న విజయ్‌రాఘవేంద్రను స్థానికులు గమనించి వెలికి తీసేలోపు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగన్‌కు మద్దతుగా నిలుద్దాం


