ఉరవకొండ: చట్టాలను తుంగలో తొక్కి పోలీసులను పావులుగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ధర్మాసనం చేసిన వాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారాయని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, పార్టీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో హైకోర్టు వాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చునన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని కోర్టులను సైతం తప్పుదోవ పట్టించేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ముఖ్యనాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతాంగ సమస్యలను గాలికొదిలేసి కూటమి ప్రభుత్వం అప్రజాస్వామ్యకంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతుల జీవనానికి ఈ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మండల ప్రజాపరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకు 99 శాతం మెజార్టీ ఉన్నా తిరుపతి, తుని, వైజాగ్, రామగిరి, కంబదూరు తదితర ప్రాంతాల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ పార్టీ ఫిరాయింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులపై కూడా కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటూ కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పెచ్చుమీరిన కూటమి నేతల అరాచకాలు
రైతుల సమస్యలు గాలికొదిలేసి బాబు పాలన
వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం


