అనంతపురం టవర్‌క్లాక్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు ఇవ్వాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుఢు దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుదవారం స్థానిక ఎన్జీఓహోమ్‌లో జల సాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలను బనకచెర్లకు తీసుకువచ్చి రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీళ్లు పారిస్తామంటూ సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా నదిలో ఏటా వంద టీఎంసీలు నీరు సముద్రం పాలవుతున్నాయని, ఈ వృథాను అరికట్టేందుకు రాయలసీమ జిల్లాల్లో తగినన్ని ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లు నిర్మించి, ఆ నీటిని మళ్లించాలన్నారు. అలా కాకుండా పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు నీటిని ఇస్తామనడం వెనుక పాలకుల స్వార్థం ఉందన్నారు. 2014–19 సంవత్సరాల మధ్య రూ 68 వేల కోట్లు సాగునీటి రంగానికి చంద్రబాబు ఖర్చు చేశారన్నారు. ఇందులో రాయలసీమకు రూ.12,400 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం చూస్తుంటే సాగునీటి బడ్జెట్లో రాయలసీమకు 18 శాతం మాత్రమే ఖర్చు పెట్టినట్లుగా అర్థమవుతోందన్నారు. మిగిలిన 82 శాతం కోస్తా ప్రాంతానికి ఖర్చు పెట్టారంటే అది ఎవరి ప్రయోజనాలకు అర్థం చేసుకోవచ్చునన్నారు. ఏపీ అంటే కేవలం అమరావతి, పోలవరం అన్నట్టుగా అభివృద్ధి మొత్తాన్ని ఒకే పాంతానికి కేంద్రీకరించి రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీ–నీవా ప్రయోజనాలకు సమాధి కట్టే కాలవ లైనింగ్ పనులు వెంటనే రద్దు చేయాలని, ప్రధాన కాలువను పది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సహాయకార్యదర్శి కృష్ణ, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, సహాయ కార్యదర్శి ప్రకాష్, ఇఫ్ టు అధ్యక్షుడు ఏసురత్నం, నాయకులు వెంకటేష్, రాహుల్, లక్ష్మి, విద్యార్థి సంఘం నాయకులు వీరేంద్ర, వేమయ్య, శంకర్, పెద్దన్న, వీర నారప్ప, చంద్ర, వైఎన్ రెడ్డి , రామకృష్ణా రెడ్డి, శేషాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి