తాడిపత్రిటౌన్: వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్‌బాషా ఇంటిపై టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులను మోహరించారు. అదే రోజు అర్ధరాత్రి డీఐజీ షిమోషి సంఘటన స్థలాలను పరిశీలించారు. ఎస్పీ జగదీష్ తాడిపత్రిలోనే ఉంటూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భార్యతో గొడవపడి
భర్త బలవన్మరణం
గార్లదిన్నె: భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన కల్లూరుకు చెందిన అబ్దుల్ షఫీ (47) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మద్యానికి బానిసైన అబ్దుల్ షఫీ రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవ జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య గుంతకల్లులోని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అబ్దుల్ షఫీ అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.