● విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంత చిన్న బల్లలపై పదో తరగతి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు.. చీఫ్ సూపరింటెండెంట్ ఏమి చేస్తున్నారు.. చూసుకోకపోతే ఎలా.. పరీక్షల నిర్వహణలో ఇంత అలసత్వంగా ఉంటే ఎలా? అంటూ కలెక్టర్ వినోద్‌కుమార్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. నగరంలోని గుడ్ చిల్డ్రన్ స్కూల్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్న పిల్లలు కూర్చునే బల్లలపై పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన బల్లలు (డెస్కులు) చాలా చిన్నవిగా ఉన్నాయని, వాటిని మార్చాలని ఆదేశించారు. వెలుతురు సరిగా లేని రూములలో లైట్లు వేయాలని, పరీక్షలు నిర్వహించే ముందు విద్యాశాఖ అధికారులు ప్రతి పరీక్ష కేంద్రాలలోని వసతులను పరిశీలించాలి కదా? అని మండిపడ్డారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 31,009 మందికి గాను 30,213 మంది హాజరయ్యారు. జిల్లాస్థాయి పరిశీలకులు ఆరు కేంద్రాలు, జిల్లా విద్యాశాఖ అధికారి ఒక కేంద్రాన్ని, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఒక కేంద్రం, ఫ్లయింగ్ స్క్వాడ్ 37 కేంద్రాలను పరిశీలించారు.