●పరీక్షల నిర్వహణకు అరకొర నిధులు కేటాయించిన ప్రభుత్వం ●చేతి నుంచి అదనంగా ఖర్చు పెడుతున్న సీఎస్‌లు
తాడిపత్రి రూరల్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు గాను కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎందుకూ సరిపోవడం లేదు. అదనపు నిధుల కోసం ఉపాధ్యాయ సంఘాలు చేసిన వినతిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్) జేబులకు చిల్లు పడుతోంది.
వైఎస్ జగన్ చొరవతో..
పదో తరగతి పరీక్షల నిర్వహణకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీ కింద రూ.5.50లు మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెరిగిన ధరలను అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టిలో ఉంచుకుని కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 2020, 2021, 2023లో కంటింజెంట్ చార్జీ రూ.5.50 నుంచి రూ.8కు పెంచారు. 2024లో రూ.10కు పెంచారు. ప్రస్తుతం అదే చార్జీలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఈ నిధులు సరిపోక అదనపు మొత్తాన్ని సీఎస్‌లే భరిస్తున్నారు.
అరకొర నిధులతో సతమతం
పోలీసు స్టేషన్లల్లో భద్రపరిచిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు, పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తపాలా కార్యాలయానికి తరలించేందుకు రవాణా ఖర్చులు, కొవ్వొత్తులు, దారం, లక్క, స్టాప్‌లర్లు, స్కెచ్ పెన్నులు, గమ్, వైట్‌నర్ తదితర స్టేషనరీ కొనుగోలు తడిసి మోపెడవుతోంది. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం, ఉర్దూ మీడియంల జవాబు పత్రాల కోసం వేర్వేరు సంచులను వాడుతున్నారు. ఒక్కో సంచి కోసం రెండు నుంచి మూడు మీటర్ల వరకు వస్త్రాన్ని వాడాల్సి వస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి కంటింజెంట్ చార్జీలను పెంచాలని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. సాధారణంగా ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం పరీక్ష నిర్వహణ కింద ఇస్తున్న ఒక్కొ విద్యార్థికి రూ.10 చొప్పున 100 మందికి సంబంధించి కేవలం రూ.వెయ్యి మాత్రమే అందుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే అన్ని ఖర్చులు కలిపితే రూ.5వేలకు పైగా అవుతుంది. దీంతో ప్రభుత్వం చెల్లించిన రూ.వెయ్యి పోను మిగిలిన రూ.4 వేలను సీఎస్‌లే భరించాల్సి వస్తోంది.
సీఎస్, డీఓలకు అరకొర భృతి
ప్రతి పరీక్ష కేంద్రానికి ఓ సీఎస్, డీఓను నియమించారు. 240మంది విద్యార్థులకు మించి ఉన్న కేంద్రానికి అదనంగా డీఓలు ఉంటున్నారు. సీఎస్‌లు, డీఓలు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లకు రూ.150 నుంచి రూ.200ల భృతి కేటాయించాలన్న డిమాండ్‌ను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పెద్దగా తేడా లేకపోయినప్పటికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఇన్విజిలేటర్లకు రూ.150 చెల్లిస్తుండగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లకు కేవలం రూ.33 మాత్రమే చెల్లిస్తున్నారు. వాటర్ బాయ్‌కి రూ.17లు, అటెండర్‌కు రూ.20లు చొప్పున భృతి చెల్లిస్తున్నారు. అరకొర భృతి చెల్లింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భృతి పెంచాలి
ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ ఖర్చులు, భృతిని ప్రభుత్వం పెంచాలి. సీఎస్‌లు, ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ ఆధికారులకు రోజుకు రూ.150 నుంచి రూ.200 భృతి చెల్లించాలి. కంటిజెన్సీ నిధులనూ పెంచాలి.
– శివశంకరయ్య, ఉద్యోగ, ఉపాధ్యాయ సేవా సంఘం కన్వీనర్, తాడిపత్రి
బడ్జెట్ అరకొర... సీఎస్‌లు విలవిల