పేదల బియ్యంపై పందికొక్కులు! | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యంపై పందికొక్కులు!

Mar 19 2025 1:51 AM | Updated on Mar 19 2025 1:49 AM

12

అనంతపురం అర్బన్‌: పేదల బియ్యాన్ని కొందరు అధికారులు, సిబ్బంది పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. యథేచ్ఛగా నొక్కుడు వ్యవహారం సాగిస్తున్నారు. నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్‌ మేరకు చౌక దుకాణాలకు బియ్యం రవాణా చేస్తారు. జిల్లాలోని 6.60 లక్షల కార్డుదారులకు 9,800 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సగటున 800 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది దందాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం సంచి బరువు (టెయిర్‌ వెయిట్‌) కింద ఒక కిలో, తరుగు కింద మరో కిలో, అదనంగా క్వింటాలుకు మరో కిలో దోచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నల్లబజారుకు...

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నెలసరి మిగుల్చుకుంటున్న దాదాపు 20 వేల కిలోల (20 టన్నులు) బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కోటాలో కోత గురించి మాట్లా డితే అధికారుల నుంచి తలనొప్పులు వస్తాయంటూ కొందరు డీలర్లు మిన్నకుండిపోతున్నారు. మరికొందరు ఈ విషయంపై మాట్లాడేందుకు కూడా జంకుతున్నారు. అయితే, బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో ‘సర్దుబాటు’ చేసుకుంటున్నామని ఓ డీలర్‌ చెప్పడం గమనార్హం.

సంచి తూకం ఇవ్వాల్సి ఉన్నా..

డీలర్లకు బియ్యం సరఫరా చేసే క్రమంలో కోటా ప్రకారం క్వింటాలు టెయిర్‌ వెయిట్‌(సంచితూకం) కాకుండా నికరంగా 100 కేజీలు ఇవ్వాలి. క్వింటాలుకు రెండు 50 కిలోల బస్తాలు (గోనె సంచులు) వస్తాయి. ఒక్కొక్క సంచి తూకం 550 గ్రాములుగా రెండు సంచులు 1,100 గ్రాములు ఉంటాయి. ఈ లెక్కన డీలర్లకు క్వింటాలు బియ్యం సంచి తూకంతో కలిసి 101.100 కిలోలు ఇవ్వాలి. అయితే అలా ఇవ్వడం లేదని తెలిసింది.

ప్రత్యేకంగా వ్యాపారులు..

గోదాముల్లో డీలర్లకు సరఫరా చేసే కోటా నుంచి నొక్కేస్తున్న బియ్యం నల్లబజారుకు తరలించేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. గోదాము నుంచి వీరు సరుకును వేరే ప్రదేశాలకు తరలించి, వాటికి కొంత మెరుగుపెట్టి (పాలిష్‌) బ్రాండెడ్‌ పేరు ఉన్న సంచుల్లో నింపుతారని సమాచారం. అనంతరం కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

చౌక ధరల దుకాణాలు

1,645

బియ్యం కార్డులు

6,60,330

జిల్లాలో

మండల లెవల్‌ స్టాక్‌

(ఎంఎల్‌ఎస్‌) పాయింట్లు

పలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో దందా

అధికారులు, సిబ్బంది చేతివాటం

క్వింటాలుకు రెండు నుంచి

మూడు కిలోల మేర కోత

నల్లబజారుకు తరలించి

సొమ్ము చేసుకుంటున్న వైనం

ప్రతి నెలా 20 టన్నుల బియ్యం పక్కదారి!

ఫిర్యాదు చేస్తే చర్యలు

డీలర్లు తమ కోటా బియ్యాన్ని దగ్గరుండి తూకం వేయించుకుని తీసుకెళ్లాలి. సంచి తూకం తీసివేయించి నికరంగా కోటా బియ్యం తీసుకోవాలి. తక్కువగా ఇస్తున్నట్లు గుర్తిస్తే ఈపాస్‌లో వేలిముద్ర వేయకూడదు. సంచి తూకం తీసివేయకపోయినా.... కోటాలో తగ్గించి ఇస్తున్నా... నాకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా.

– రమేష్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌,

పౌర సరఫరాల సంస్థ

పేదల బియ్యంపై పందికొక్కులు! 1
1/3

పేదల బియ్యంపై పందికొక్కులు!

పేదల బియ్యంపై పందికొక్కులు! 2
2/3

పేదల బియ్యంపై పందికొక్కులు!

పేదల బియ్యంపై పందికొక్కులు! 3
3/3

పేదల బియ్యంపై పందికొక్కులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement