తాడిపత్రి: మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన 14 మంది మహిళా కూలీలు మంగళవారం ఉదయం నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం పేరుసోమల గ్రామానికి మిరప పంట కోతకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు వెంకటరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే టైర్ పగలడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది మహిళలూ గాయపడ్డారు. వీరిలో శారద, లక్ష్మీదేవి, రమణమ్మ, రసూల్‌బీ, మాబ్బి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని అనంతపురానికి రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక రసూల్‌బీ (52) మృతి చెందింది. ఆమెకు భర్త మహబూబ్‌బాషా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.