డి.హీరేహాళ్(రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రూతమ్మ దంపతుల మూడవ కుమార్తె అర్పిత (5) ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన అర్పిత బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో విద్యుత్ బల్బుకు అనుసంధానం చేసిన వైరు తెగి రేకు తలుపుపై పడింది. విషయాన్ని గమనించని బాలిక తలుపు తీసేందుకు ప్రయత్నించినప్పుడు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాత్రూమ్‌కు వెళ్లిన బిడ్డ ఎంతసేపటికి రాకపోవడంతో అటుగా వెళ్లి గమనించిన తల్లికి విగత జీవిగా పడి ఉన్న అర్పిత కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని విద్యుత్ సరఫరాను ఆపి అర్పిత మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. కాగా, బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన తండ్రి తిప్పేస్వామికి విషయాన్ని చేరవేయడంతో ఆయన బయలుదేరినట్లు సమాచారం.
క్లస్టర్ రీసోర్స్ సెంటర్లకు నిధుల మంజూరు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో కొత్తగా ఏర్పడిన 135 క్లస్టర్ రీసోర్స్ సెంటర్ల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు కేటాయించిన రూ. 1.35 కోట్ల క్లస్టర్ రీసోర్స్ గ్రాంట్‌ను ఆయా క్లస్టర్ పాఠశాలల హెచ్‌ఎంలకు నాలుగు పద్దుల కింద విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. మీటింగ్ ఏటీ గ్రాంట్, మెయింటినెన్స్ గ్రాంట్, కంటిన్జెన్సీ గ్రాంట్, టీఎల్‌ఎం గ్రాంట్ కింద ఒక్కో క్లస్టర్ రీసోర్స్ సెంటర్‌కు రూ. లక్ష చొప్పున విడుదల చేశామన్నారు. నిబంధనల మేరకు ఖర్చు చేసి వివరాలను మండల విద్యాశాఖ అధికారి ఆమోదంతో టీసీఎస్ వారు రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమగ్రశిక్ష ద్వారా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ దామాషాలో భాగంగా మొత్తం రూ. 16 లక్షలను ఆయా కళాశాలలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. నిధులను ఖర్చు చేసి ఎంఈఓల ఆమోదంతో టీసీఎస్ రూపొందించిన యాప్, ప్రబంద్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
టీడీపీ నేతల దాష్టీకం
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కర్రలతో దాడి
ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయణస్వామి, రమేష్, భరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు.
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి