అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి కిందపడిన డ్రైవర్.. తన వాహనం చక్రాల కింద నలిగి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం నగరంలోని రద్దీగా ఉండే అశోక్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... నగరంలోని మరువకొమ్మ కాలనీలో నివాసముంటున్న ముత్యాలు (38) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పనిలో భాగంగా ట్రాక్టర్‌ను డ్రైవింగ్ చేస్తూ అశోక్‌గనగర్‌లోని హరిహర ఆలయం వద్దకు చేరుకోగానే ముత్యాలుకు మూర్ఛవచ్చింది. వాహన నియంత్రణ కోల్పోవడంతో పాటు అదుపు తప్పి కిందకు జారిపడ్డాడు. అదే సమయంలో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆయన మీదుగా దూసుకెళ్లాయి. ఘటనలో ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న ట్రాక్టర్‌ను గమనించిన స్థానిక మెకానిక్‌లు వెంటనే స్పందించి చాకచక్యంగా బ్రేకులు వేసి, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, ముత్యాలు మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.