8న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

8న జాతీయ లోక్‌అదాలత్‌

Mar 6 2025 12:52 AM | Updated on Mar 6 2025 12:50 AM

అదాలత్‌ తీర్పు ‘సుప్రీం’

ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌

అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో ఇచ్చే తీర్పులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్‌ అదాలత్‌ ఉంటుందన్నారు. గత లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం పరంగా రాష్ట్రంలోనే జిల్లా 9వ స్థానంలో నిలిచిందని, ఈ సారి ఆ స్థానాన్ని మెరుగుపరచాలన్నారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో 6,294 కేసులను పరిష్కరించడానికి ఆయా బెంచ్‌లు కృషి చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌ పీడీగా నాగమణి

అనంతపురం సెంట్రల్‌: జిల్లా ఐసీడీఎస్‌ పీడీగా ఎం.నాగమణి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం సీడీపీఓగా పనిచేస్తున్న ఎం. నాగమణికి పదోన్నతి కల్పించి జిల్లా పీడీగా నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్‌ పీడీగా తాడిపత్రి సీడీపీఓ టి. శ్రీదేవికి అదనపు బాధ్యతలు (ఆన్‌డ్యూటీ) అప్పగించారు.

ఇంటర్‌ సిటీ ప్యాసింజర్‌ రైళ్లకూ బ్రేకులు!

గుంతకల్లు: హుబ్లీ–తిరుపతి మధ్య గుంతకల్లు జంక్షన్‌ మీదుగా తిరుగుతున్న ఇంటర్‌ సిటీ ప్యాసింజర్‌ రద్దును కూడా ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు బుధవారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్‌ ఈ నెల 30 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్‌ (57402) ప్యాసింజర్‌ రద్దును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు వివరించారు. కాగా, కుంభమేళాకు తరలించిన పలు ప్యాసింజర్‌ రైళ్లు ఈ నెలాఖరు వరకూ రాకపోకలు సాగించవని ఇదివరకే అధికారులు ప్రకటించారు.

వాహనం ఢీకొని

పాత్రికేయుడికి తీవ్రగాయాలు

పెద్దవడుగూరు: వాహనం ఢీకొన్న ఘటనలో యాడికి మండల ‘సాక్షి’ విలేకరి శ్రీనివాసులు గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. యాడికి మండలం చందన గ్రామానికి చెందిన శ్రీనివాసులు గౌడ్‌ బుధవారం ఉదయం వ్యక్తిగత పనిపై ద్విచక్రవాహనంలో గుత్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో తనను కలసిన పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లికి చెందిన వృద్ధుడు లక్ష్మీరెడ్డిని వాహనంపై ఎక్కించుకుని వెళుతుండగా... పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనాన్ని నిలపకుండా ముందుకు దూసుకెళ్లాడు. ప్రమాదంలో శ్రీనివాసులు గౌడ్‌, లక్ష్మీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎ.తిమ్మాపురం గ్రామానికి చెందిన సీపీఐ నేత వెంకట్రాముడు యాదవ్‌, పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రు లను 108 అంబులెన్స్‌లో గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాసులుగౌడ్‌ను కర్నూలులోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, ప్రమాద స్థలానికి అరగంట ఆలస్యంగా చేరుకున్న 108 సిబ్బంది అక్కడ తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులుగౌడ్‌ను చూడగానే అంబులెన్స్‌లోకి ఎక్కించి ప్రేక్షక పాత్ర పోషించడాన్ని స్థానికులు తప్పుబట్టారు. కనీసం స్ట్రెచర్‌ కూడా తీయకుండా అది పనిచేయడం లేదంటూ బుకాయించడాన్ని మండల సీపీఐ కార్యదర్శి వెంకట్రాముడుయాదవ్‌ ఖండించారు. క్షతగాత్రుల విషయంలో 108 అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరును ఆయన ఆక్షేపించారు.

8న జాతీయ లోక్‌అదాలత్‌ 1
1/1

8న జాతీయ లోక్‌అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement