రాయదుర్గం టౌన్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని సండూరు తాలూకా వడ్డేరహళ్లికి చెందిన దాదాపు 25 మంది బొలెరో వాహనంలో బయలుదేరి కుందుర్పి మండలం బెస్తరపల్లిలో సోమవారం జరిగిన బొమ్మలింగేశ్వరస్వామి జాతరలో పాల్గొన్నారు. అదే రోజు తిరుగు ప్రయాణమైన వారు రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం పట్టణ శివారులోని 74 ఉడేగోళం సమీపంలోకి చేరుకోగానే జాతీయ రహదారిపై అడ్డుగా వచ్చిన కుక్కను డ్రైవర్ గమనించి సడన్ బ్రేక్ వేయడంతో వాహనం చివర నిద్రిస్తున్న సుశీల(15) కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కింద పడిన వీరమాసెన్న, మురెగప్పకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ జయానాయక్, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసు వాహనంలోనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.