
ఆత్మహత్యాయత్నం చేస్తున్న బాలింతను రక్షిస్తున్న బంధువులు
పెనుకొండ రూరల్: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో భర్త ముఖం చాటేశాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న బాలింత ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో అప్రమత్తమైన బంధువులు ఆమెను కాపాడి ఇంటికి చేర్చారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన శావణిబాయికి అడదాకులపల్లికి చెందిన మహేష్‌నాయక్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.50 వేలు, మూడు తులాల బంగారాన్ని శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చారు. ఏడాది పాటు కాపురం సజావుగా సాగినా... మొదటి ప్రసవంలో ఆడపిల్ల పుట్టడంతో అదనపు కట్నం కావాలంటూ భర్త వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో ముఖం చాటేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన శ్రావణి మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకేందుకు సిద్ధమైంది. విషయాన్ని గమనించిన సమీప బంధువులు వెంటనే అప్రమత్తమై ఆమెను పక్కకు లాగారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.