
ఘటనను వివరిస్తున్న బాధితురాలు ఉష
కళ్యాణదుర్గం: కాలినడకన వెళుతున్న ఓ వివాహిత మెడలోని బంగారు మాంగ్యలంచైన్‌ను దుండగుడు లాక్కెళ్లాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీలో నివాసముంటున్న ఉష.. ఆదివారం ఉదయం తన స్నేహితురాలితో కలసి పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వేకువజామునే ఇంటి వద్ద నుంచి బస్టాండ్‌కు ఒంటరిగా బయలుదేరిన వారిని వెంబడిస్తూ వచ్చిన దుండగుడు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వెనుక నుంచి ఉష మెడలోని మూడు తులాల బరువైన బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని వడ్డే కాలనీ వైపు పరుగు తీశాడు. ఉషతో పాటు ఆమె స్నేహితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు ఆగంతకుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. బాధితురాలు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. దుండగుడు ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతం..
బాలురకు తీవ్రగాయాలు
ధర్మవరం అర్బన్: విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని రామ్‌నగర్‌కు చెందిన దీక్షిత్ (3వ తరగతి), ధర్మతేజ (5వ తరగతి) స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడుకుంటుండగా బంతి నేరుగా వెళ్లి ఓ ఇంటి బాత్‌రూంపై పడింది. దీంతో దీక్షిత్, ధర్మతేజ మిద్దె ఎక్కి కడ్డీ సాయంతో బంతిని తీస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగిలి షాక్‌కు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గాయపడిన దీక్షిత్