రాప్తాడు రూరల్: రాయల్టీ అధికారులంటూ బెదిరించి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దుండగులు చివరకు పోలీసులు పట్టుబడ్డారు. వివరాలు... తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ ట్రాక్టర్ ఈ నెల 8న కళ్యాణదుర్గం వైపు నల్లబండల లోడుతో వెళుతుండగా రాత్రి 11 గంటలకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట దాటగానే ముగ్గురు వ్యక్తులు అటకాయించారు. తాము రాయల్టీ అధికారులమంటూ డ్రైవర్‌ను బెదిరించారు. భయపడిన డ్రైవర్ ట్రాక్టర్ దిగడంతో దుండగుల్లో ఒకరు ట్రాక్టర్ ఎక్కి పక్కకు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో చాలా బండలు విరిగిపోయాయి. ఇంతలో దుండగులు డ్రైవర్‌ను బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కొన్నారు. అటుగా వెళ్తున్న కొందరు అనుమానం వచ్చి సమాచారం అందించడంతో రూరల్ పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురూ సజ్జలకాలవ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులపై సీఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి, బాధితుడికి నష్టపరిహారం ఇప్పించారు.
వివాహిత ఆత్మహత్య
పెనుకొండ రూరల్: జీవితంపై విరక్తితో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... పెనుకొండ మండలం మరువపల్లికి చెందిన పుష్పలత (30)కు గుట్టూరు నివాసి మహేంద్రతో పదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలుగకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనైన ఆమె శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం వేకువజామున ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసు లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్‌ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేపట్టారు.