
ఊబిచెర్లలో సచివాలయ ఉద్యోగులకు సూచనలు ఇస్తున్న బాలూనాయక్
● పీఆర్ సీఈ బాలూనాయక్
గుత్తి రూరల్: గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ బాలూనాయక్ ఆదేశించారు. గుత్తి మండలం ఊబిచెర్లలో చేపట్టిన ఆర్‌బీకే, హెల్త్ సెంటర్ నిర్మాణాలను ఆదివారం ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, ఈఈ చంద్రశేఖర్, ప్రాజెక్టు డీఈఈ ప్రసాద్, డీఈ మురళీధర్, క్యూసీ డీఈ భరత్ ప్రకాష్, ఏఈ మల్లేష్‌నాయక్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
ఈ–క్రాప్ నమోదుతోనే
పరిహారం : డీఏఓ
రాప్తాడు: ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని, లేకుండా పంట నష్టపోయినప్పుడు పరిహారం అందకుండా పోయే ప్రమాదముందని రైతులను జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఉమామహేశరమ్మ హెచ్చరించారు. ఆదివారం రాప్తాడులోని రైతు భరోసా కేంద్రంలో ఈ–కేవైసీ నమోదుకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించి, మాట్లాడారు. పంటలు సాగు చేసిన రైతులందరూ తప్పని సరిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 97 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 8,55,035 ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు ఇతర పంటలూ సాగులో ఉన్నాయన్నారు. ఇందులో 8,29,441 ఎకరాల్లో ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయిందన్నారు. 2,30, 252 మంది రైతులు పంటలు సాగు చేయగా, వీరిలో 37 శాతం మంది మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేయించారన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు ఈ–కేవైసీ పూర్తి చేయించాలని సూచించారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేయిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా 80 శాతం సబ్సిడీతో ఉలవలు, పెసలు, జొన్నలు, అలసందల విత్తనాలు అందజేస్తున్నట్లు వివరించారు.
ఎ.కొండాపురంలో వ్యక్తి మృతి
పుట్లూరు: ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని అంబేడ్కర్ కాలనీ నివాసి నాగరంగయ్య(42) పుట్లూరు మండలం సూరేపల్లిలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో సూరేపల్లికి వచ్చిన ఆయన ఆదివారం తిరుగు ప్రయాణమై ఎ.కొండాపురానికి చేరుకున్నాడు. అక్కడ మూర్ఛ రావడంతో కిందపడి గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ–కేవైసీ నమోదుపై ఆరా తీస్తున్న జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ