
పచ్చని పంట పొలాల పక్కనే కనిపిస్తున్న పామిడి గ్రామం
జిల్లాలోని పామిడి గ్రామ సమీపంలో పెన్నా నదిలో నీరు పారితే సూర్యుడు పడమట ఉదయించినంత అద్భుతంగా పెద్దలు చెబుతుంటారు. మూడు దశాబ్దాల క్రితం ఈ ప్రాంత వాసులు పెన్నా నదిలో నీరు ప్రవహించడం చూశారు. ఆ తర్వాత చూద్దామంటే నీటి చుక్క లేకుండా పోవడంతో పీనుగులను కాల్చే వల్లకాడుగా మారింది. దీంతో పీనుగుల పెన్నాగా పిలిచేవారు. మళ్లీ ఇన్నాళ్లకు పెన్న ప్రవహిస్తోంది. అలాఇలా కాదు.. ఏకంగా జీవనదిలా పాయలుగా మారి ప్రవహిస్తోంది. దీంతో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంత కాలం బీళ్లుగా పడి ఉన్న భూములు కాస్త మాగాణులయ్యాయి. బోడి కొండలు పచ్చదనం సంతరించుకున్నాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు పంటలు తీయడం గగనమైన ప్రాంతంలో ఇప్పుడు ఏకంగా మూడో పంట తీసేందుకు రైతులు పోటీ పడ్డారు. దీంతో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

కనుచూపు మేర ఎటు చూసినా కనువిందు చేస్తున్న పచ్చదనం

పచ్చదనం సంతరించుకున్న బోడి కొండలు
