
బాధితులు మజాహర్ అహ్మద్, ఫరీదా దంపతులు
బత్తలపల్లి: దుబాయ్ కరెన్సీ పేరుతో ముస్లిం దంపతులను బురిడీ కొట్టించాడో ఘనుడు. రూ. 8 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం పాతూరులోని తాడిపత్రి బస్టాండ్ వద్ద మజాహర్ అహ్మద్ చెప్పుల దుకాణంతో పాటు కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సలీం అనే వ్యక్తి షాపు వద్దకొచ్చి కూల్‌డ్రింక్ తాగాడు. తనది బిహార్ రాష్ట్రమని, పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నానంటూ మాటలు కలిపాడు. తన వద్ద దుబాయ్ కరెన్సీ ఉందని, మీరు మంచివారుగా ఉన్నారు అందుకే రూ. 16 లక్షల విలువ చేసే కరెన్సీని రూ.8 లక్షలకే ఇస్తానని ఆశ చూపాడు. నోట్లు ఇవ్వండి పరీక్షించుకుంటానని మజాహర్ అహ్మద్ కోరగా, సలీం ఆయనకు ఓ నోటు ఇచ్చాడు. తెలిసిన వ్యక్తి బెంగళూరులో ఉండడంతో మజాహర్ ఆయనను సంప్రదించాడు. సదరు నోటు భారత కరెన్సీ ప్రకారం రూ.16 పలుకుతుందని ఆయన తెలిపాడు. దుబాయ్ కరెన్సీ ఎలా వచ్చిందని మజాహర్‌ను ప్రశ్నిస్తే.. తాము ముంబైలో ఓ ధనవంతురాలైన వృద్ధురాలి వద్ద పని చేస్తుండగా ఆమె చనిపోయిందని, ఆమె కుమారుడు వారి తల్లికి చేసిన సేవకు గుర్తుగా సదరు కరెన్సీ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే సలీంకు మజాహర్ ఫోన్ చేసి దుబాయ్ కరెన్సీ చూపాలని కోరాడు. బత్తలపల్లికి వస్తే చూపిస్తానని సలీం తెలపగా.. ఆయన చెప్పినట్టే మూడు రోజుల క్రితం బత్తలపల్లి వచ్చాడు. సలీం అతడిని స్థానికంగా జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి దుబాయ్ కరెన్సీ చూపాడు. వెంటనే ఎంతో సంతోషంతో అక్కడి నుంచి అనంతపురం చేరుకున్న మజాహర్.. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు తెలిసిన వారి నుంచి కొంత అప్పు తీసుకుని మొత్తం రూ. 8 లక్షలు పోగు చేసుకున్నాడు. ఆదివారం తన భార్య ఫరీదాతో కలిసి ద్విచక్రవాహనంలో బత్తలపల్లికి వస్తున్నట్లు సలీంకు సమాచారమివ్వగా, ఎస్టీ కాలనీకి రావాలని అతను సూచించాడు. అప్పటికే ఓ మహిళతో కలిసి అక్కడున్న సలీం.. మజాహర్ దంపతులు రాగానే దుబాయ్ కరెన్సీ ఇందులో ఉందని చెప్పి ఓ మూట వారికి అందజేశాడు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి ద్విచక్రవాహనంలో ఉడాయించాడు. వారు వెళ్లిన కొద్ది సేపటికి బ్యాగు తెరిచి చూస్తే అందులో పాత న్యూస్ పేపర్లు కనబడ్డాయి. దీంతో హతాశులైన దంపతులు లబోదిబోమంటూ బత్తలపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తాము ఎలా మోసపోయిందీ వివరించారు. మూట ఇస్తున్న సమయంలో అవతలివారికి తెలియకుండా చిత్రించిన వీడియో చూపించారు. అయితే, ఇదంతా జరిగింది అనంతపురంలో కనుక అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు చెప్పారని, అనంతపురం వెళ్తే జరిగింది బత్తలపల్లిలో కాబట్టి అక్కడికే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సలీంకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ముఠా కాపు కాసినట్లు తెలిసింది. దాదాపు ఏడు మంది మరో వ్యాన్‌లో పర్యవేక్షించినట్లు సమాచారం.
ముస్లిం దంపతులకు
రూ.8 లక్షలకు కుచ్చుటోపీ

మోసగాడు సలీం, సలీం వెంట వచ్చిన ఓ మహిళ
