
అనంతపురం రూరల్: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గౌతమి అన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే తప్పనిసరిగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలో ‘ఏక్ దిన్ ఏక్ గంట’ పేరిట శ్రమదానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ హాజరై శ్రమదానం చేశారు. అనంతరం జేఎన్‌టీయూ కళాశాల మైదానంలో పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరిక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించినట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్యం కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారని ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అలాగే ‘కాఫీ విత్ క్లాప్ మిత్ర’లో భాగంగా కార్మికులతో కలసి కాఫీ తాగారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్డీఓ మధుసూదన్, సర్పంచ్ ఉదయ్‌శంకర్, ఎంపీపీ వరలక్ష్మి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల పిలుపు
అనంతపురం రూరల్‌లో శ్రమదానం
పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం
